Ramanujacharya Sahasrabdi : శ్రీ రామానుజాచార్య వేయేళ్ల జాతర మొదలుయ్యింది. సమతామూర్తి గా పిలువబడే రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం చూడబోతోంది. శ్రీ రామానుజాచార్య స్వామి పదకొండవ శతాబ్దంలో భారతదేశంలో జన్మించిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహా సాధ్వికుడు. ఆయన 1003వ జయంతిని పురస్కరించుకుని ఈ ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ (Statue Of Equality)ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ ఆశ్రమంలో కొలువుదీరనున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Statue Of Equality : ముచ్చింతల్ లో ఉత్సవ వాతావరణం
ఈరోజు ఉదయం నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 రోజుల పాటు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. వేలాది మంది వాలంటీర్లు, రుత్విక్కులు, ఇతరుల రాకతో ముచ్చింతల్ లో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు, తోరణాలతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా కనిపిస్తోంది.
వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమయంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ఈ లోకానికి సమానత్వ భావాలను నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి అడ్డంకిగా మారుతున్న సమయంలో ఆయన నింపిన స్ఫూర్తి మరోసారి ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందంటూ చిన్నజీయర్ స్వామి ఈ బృహత్ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు.
బుధవారం ఉదయం 8 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 8 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాల్లో కీలకమైన హోమాలు మొదలు కానున్నాయి. అరణి మతనం, అగ్నిప్రతిష్ట జరుగనున్నాయి. కార్య్రక్రమాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World