Postal jobs: కేవలం పదో తరగతి మాత్రమే చదివాం మాకేం ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని బాధ పడే వారి కోసమే ఈ న్యూస్. ఈ ప్రభుత్వ కొలువులకు కేవలం పదో తరగతి చదివితే చాలు అర్హులే. అందులోనూ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38,926 ఖాళీలలను భర్తీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పోస్టుల్లో తెలంగాణలో 1,226 ఖాళీలు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో 1,716 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 38,926 ఖాళీల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం),డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి చదివితే చాలు. అలాగే సైకిల్ తొక్కడం తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. స్థానిక భాషలో మాట్లాడగలగాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం, డాక్సేవక్ పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ. 10000 వేతనంగా చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మెరిట్ లిస్ట్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 2,2022 నుండి ప్రారంభం అవుతుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 5,2022గా నిర్ణయించారు.