Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ (NCS) ధృవీకరించింది. భారత కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 3:59 గంటలకు భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
NCS డేటా ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప కేంద్రం అక్షాంశం 29.17N, రేఖాంశం 81.59E వద్ద నమోదైంది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి గణనీయమైన నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్టుగా నివేదికలు లేవు. భూకంప ప్రభావిత ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం, ఈ భూకంపం వల్ల ఎక్కడ, ఎంత మంది ప్రభావితమయ్యారు అనేదానిపై సమాచారం తెలియాల్సి ఉంది.
నేపాల్‌లో భూకంపాలు సాధారణమే :
నేపాల్‌లో భూకంపాలు రావడం కొత్తేమీ కాదు. ఈ దేశ ప్రజలకు భూకంపం సాధారణ విషయంగా చెప్పవచ్చు. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 తేదీలలో కూడా భూకంపం సంభవించింది. డిసెంబర్ 19న నేపాల్‌లోని పార్షేకు 16 కిలోమీటర్ల దూరంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించగా, డిసెంబర్ 17న మెల్బిసౌనీకి 23 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నవంబర్ 2023లోనే నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 150 మందికి పైగా మరణించారు.
భూకంపం సంభవించినప్పుడు ఏం చేయాలంటే? :
1. బలమైన భూకంపం వచ్చినట్లు అనిపిస్తే.. ఇంట్లో ఫర్నిచర్ లేదా టేబుల్ కింద కూర్చుని మీ తలపై చేతులు ఉంచండి. తేలికపాటి భూకంపం వస్తే.. ఇంటి నేలపై కూర్చోండి.
2. మీరు ఎత్తైన భవనంలో నివసిస్తుంటే.. మీరు భూకంపం ప్రకంపనలను అనుభవించే వరకు ఇంట్లోనే ఉండండి. భూకంప ప్రకంపనలు ఆగినప్పుడు భవనం కిందకు వెళ్లండి.
3. మీరు కిందకు వెళ్లినప్పుడు భవనం నుంచి ఎక్కడో దూరంగా నిలబడండి. తద్వారా భవనం కూలిపోతే మీ ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదు.
4. మీరు ఎత్తైన భవనాలలో నివసిస్తున్నట్లయితే.. మెట్లు దిగడం ఎల్లప్పుడూ మంచిది. పొరపాటున కూడా లిఫ్ట్‌ని తీసుకోకండి.
5. ఎందుకంటే.. భూకంపం సంభవించినప్పుడు పవర్ కట్ కావచ్చు. దాని వల్ల మీరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవచ్చు.
6. భవనాల కింద విద్యుత్ స్తంభాలు, చెట్లు, వైర్లు, ఫ్లై ఓవర్లు, వంతెనలు, భారీ వాహనాల దగ్గర నిలబడవద్దు.
7. మీరు భూకంపం సమయంలో డ్రైవింగ్ చేస్తుంటే.. కారును ఆపి అందులో కూర్చోండి. మీకు లేదా మీ వాహనానికి ఎలాంటి నష్టం జరగకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయండి.
8. మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా బలమైన భూకంపం కారణంగా శిధిలాల కింద చిక్కుకుంటే.. ఏదైనా తొలగించడం చేయకండి లేదా బయటకు రావడానికి ప్రయత్నించకండి.
9. విపత్తు సహాయ కిట్‌ని ఇంట్లో ఎప్పుడూ ఒక బాక్సులో సిద్ధంగా ఉంచుకోండి.
10. ఇంట్లోని విద్యుత్ స్విచ్‌లు, గ్యాస్, లైట్లు మొదలైనవన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. ప్రమాదాలకు కారణం కావచ్చు.
Read Also : Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!