ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ బాంబే గురువారం కొత్త కాల పట్టికను విడుదల చేసింది. ఈసారి జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తామని నెల రోజుల క్రితం ప్రకటించినప్పటికీ.. ఆ తేదీలను మారుస్తున్నట్లు వివరించింది. అంతే కాకుండా ఆ తేదీలను కూడా ప్రకటించింది. జేఈఈ మెయిన్ చివరి విడత జులై 30వ తేదీతో ముగుస్తుంది. అలాగే ఎన్‌టీఏ అధికారులు మెయిన్ ర్యాంకులను ఆగస్టు 6వ తేదీన వెల్లడిస్తామని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దాంతో అందులో ఉత్తీర్ణులైన వారు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ఆగస్టు 7వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఐఐటీ బాంబే ప్రకటించింది.
అయితే ఆగస్టు 11వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షను అదే నెల 28వ తేదీన నిర్వహిస్తారు. అంటే జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తర్వాత అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే గడువు 20 రోజులు మాత్రమే ఇచ్చారు. గతంలో దాదాపు నెల రోజులు ఇచ్చేవారు. ఈసారి విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించేందుకు తక్కువ గడువు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను సెప్టెంబరు 11వ తేదీన వెల్లడిస్తారు. ఒకవేళ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనవారు ఐఐటీల్లో బీఆర్క్ చదవాలనుకుంటే సెప్టెంబరు 14న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)ను జరుపుతారు. వాటి ఫలితాలు 17వ తేదీన ప్రకటిస్తారు.