New traffic rules: పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలకు వివిధ శ్లాబుల్లో చలానాలు విధించేందుకు ట్రాఫిక్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కనీస వేగానికి మించి వాహనం నడిపితే… వేగాన్ని గుర్తించి జరిమానా విధిస్తారు. ఉదాహరణకు 50 కిలో మీటర్ల పరిమితి ఉన్నప్పుడు దానికి మించి ఎన్ని కిలో మీటర్లు వేగంగా వెళ్తుందో పరిశీలించి… పరిమితికి 10 కిలో మీటర్లు దాటితే ఓ రకం, 20కిలో మీటర్లు దాటితే కాస్త ఎక్కువ, అలాగే 30 కిలో మీటర్ల దాటితే మరింతగా చలానాలు విధిస్తారు.
వాహన వేగాన్ని గుర్తించడానికి మరిన్ని ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రద్దీ ప్రాంతాల్లో అడ్డదిడ్డమైన పార్కింగ్ కు కూడా చెక్ పెట్టనున్నారు. పార్కింగ్ ఏర్పాటు లేకుండా వ్యాపారం చేసే ప్రాంతాలను ట్రాఫిక్ పరంగా సమస్యాత్మకంగా గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్ లకు పాల్పడే వాహన చోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు వ్యాపార సంస్థల నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.