Interesting news: ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటారు. ఈ మధ్య అయితే మనమిద్దరం మనకిద్దరు అనే ధోరణి బాగా పెరిగిపోయింది. అంటే దంపతులిద్దరూ వారికి ఇద్దరు పిల్లలు అనేది చాలా పెరిగిపోయింది. ఉమ్మడి కుటుంబం అంటే తాత, నానమ్మలతో పాటు బాబాయి, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, వారి పిల్లలు ఇలా అంతా కలిసి ఉండే వారు ఒకప్పుడు. తక్కువలో తక్కువ ఆరుగురు సభ్యులు ఉంటే దానిని చిన్నపాటి ఉమ్మడి కుటుంబం అనే వారు.
ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. ఆధునికీకరణ, ఆర్థిక ఉద్యోగ తదితర కారణాల వల్ల చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కూడా ఓ కుటుంబం ఉమ్మడిగానే జీవిస్తోంది. ఇంతకూ ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటారో తెలుసుకుందామా… రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతంలోని ఆరుగురు అన్నదమ్మలు, మనవళ్లు, మనవరాళ్లు పుట్టినా ఇప్పటికీ కలిసే ఉంటున్నారు.
అన్నదమ్ముల భార్యలు, వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా మొత్తం 164 మంది కుటుంబం ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారి ఇంట్లో మొత్తం 50 గదులు ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కుటుంబాన్ని పోషించాలంటే ఎంత మొత్తంలో డబ్బులు కావాలో తెలిస్తే షాక్ కావాల్సిందే. వీరి నెల వారి నిత్యావసర సరుకుల ఖర్చు.. ఓ సగటు ఉద్యోగి సంవత్సరాదాయానికి సమానం.
సరిగ్గా చెప్పాలంటే ఆ కుటుంబం నిత్యావసర సరుకుల కోసం నెలకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తుంది. రోజుకు 30 కిలోల కూరగాయలు, సుమారు 60 కిలోల పిండిని వంట కోసం ఉపయోగిస్తారు. సుమారు 17 మంది మహిళలు వంటింట్లో ఒకరికొకరు సాయం చేసుకుంటారు.