Crime News: రోడ్డు ప్రమాదం నవ వధువుని పొట్టన పెట్టుకుంది. అచ్చట ముచ్చట తీరలేదు… పెళ్ళై 24 రోజులే అయ్యింది. బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి హాజరైన కొత్తజంట, ఆనందంగా ఫంక్షన్ ముగించుకుని కొత్తజంట కబుర్లు చెప్పుకుంటూ బైక్ లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలోనే మృత్యువు వారి ఆనందాన్ని కబళించింది. ఊహించని ప్రమాదంలో వధువు మృత్యువాత చెందింది. నెల రోజులు తిరగకముందే కట్టుకున్న భార్య కళ్లెదుటే చనిపోయింది. ఈ విచారకర సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్ పేట కు చెందిన బలవంతపు మధు, సదా లకు ఫిబ్రవరి 14న వివాహం అయింది. ప్రేమికులరోజున ఒకటైన ఈ జంట, ఖమ్మం జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ అనే గ్రామంలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో అక్కడికి వెళ్లారు. వేడుక ముగిసిన తర్వాత ఇద్దరూ బైక్ పై తిరుగు ప్రయాణం అయ్యారు. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రాయపట్నం సమీపంలోకి రాగానే ఘోర ప్రమాదం జరిగింది.
కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న జంట, బైక్ స్కిడ్ అవడంతో కిందపడిపోయారు. వెనక కూర్చున్న సదా కింద పడే సమయంలో తలకు రోడ్డు బలంగా తాకడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే 108కు ఫోన్ చేసి ఆమెను మధిర ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పరీక్షించిన డాక్టర్ మనోరమ ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బయల్దేరి రెండు కిలోమీటర్లు కూడా వెళ్ళకముందే ప్రమాదం జరిగి నవ వధువు మృతి చెందింది అని తెలియడంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించి మధిర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.