Crime News: ప్రస్తుతం ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు అతివేగంగా నడపడం వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు అమలు చేసినా కూడా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అతివేగం కారణంగా ఇటీవల మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడు పుట్టినరోజు నాడే మృత్యువాత పడ్డాడు.
వివరాల్లోకి వెళితే…మంచిర్యాల జిల్లా కేంద్రం రాంనగర్‌కు చెందిన బానోతు వంశీకృష్ణ నాయక్ అనే యువకుడు డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం తన పుట్టిన రోజు కావడంతో ఎంతో సంతోషంగా సినిమా చూసేందుకు వెళుతున్నానని తల్లికి చెప్పి బయలుదేరాడు. మంచిర్యాల నుంచి ద్విచక్ర వాహనం మీద పెద్దపల్లి వైపు వెళుతుండగా.. ఉదయం 11 గంటల సమయంలో అతి వేగం కారణంగా బైక్ అదుపు తప్పడంతో రామగుండం సమీపంలోని అంతర్గాం పీఎస్ లిమిట్స్రాజీవ్ రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర డివైడర్‌ను ఢీకొట్టాడు. వేగంగా వచ్చి బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో వంశీకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే వంశీకృష్ణను గోదావరిఖని సర్కారు దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి అత్యంత వేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు . పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత డెడ్‌బాడీని సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం గర్జనపల్లికి తరలించారు. 2003 లో జరిగిన యాక్సిడెంట్ లో తండ్రి, అన్నను పోగొట్టుకున్న వంశీకృష్ణ తల్లితో కలిసి ఉండేవాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారాబంగా పెంచుకున్న తల్లి ఇలా పుట్టిన రోజు నాడే కొడుకు మృత్యువాత పడటంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా మారింది.