...

Rajinikanth: రాత్రిపూట హడావుడిగా హాస్పిటల్‌లో చేరడానికి కారణమిదే

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హాస్పిటల్‌లో జాయిన్ అయి.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయనకు ఏమయిందో ఏమిటో అని అంతా ఆందోళనపడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీ ఇవ్వాలనుకున్న పాలిటిక్స్‌కు కూడా రజినీకాంత్ దూరంగా జరిగారు. పొలిటికల్ పార్టీ పెట్టి బరిలోకి దిగాలనుకున్న రజినీ.. సడెన్‌గా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని, రాజకీయాల్లోకి వచ్చి.. లేనిపోని తలనొప్పులు తలకెత్తుకుని ఇబ్బంది పడేకన్నా.. సినిమాలు చేసుకుంటూ హాయిగా జీవితం గడపాలనే.. తను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారికంగా రజనీకాంత్ ప్రకటించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే సడెన్‌గా గురువారం రాత్రిపూట రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరడంతో అందరిలో ఆందోళనమొదలైంది.

ఎందుకంటే రెండు రోజుల ముందు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని అందుకున్న రజినీకాంత్.. ఆ సమయంలో చాలా సంతోషంగా కనిపించారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆయనకి ఉన్నట్లుగా కనిపించలేదు. కానీ సడెన్‌గా గురువారం ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో చేరినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో రజనీకాంత్‌కి ఏమై ఉంటుందా? అనే అంతా అనుకుంటున్న సమయంలో సామాజిక మాధ్యమాల్లో.. ఆయన అనారోగ్యానికి గురయ్యారని, తీవ్ర అస్వస్థత చెందారంటూ వదంతులు వ్యాపించాయి. ఈ వదంతులకు చెక్ పెడుతూ.. రజనీ సతీమణి లత రజనీకాంత్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు.

‘‘ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏటా నిర్వహించే సాధారణ పరీక్షల నిమిత్తమై ఆయన కావేరీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అంతకు మించి ఏమీ లేదు’’ అని లత రజనీకాంత్ తెలిపారు. దీంతో రజినీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రజనీకాంత్‌కు గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చిందని, వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని కావేరీ హాస్పిటల్‌లో చేర్చారని, పరీక్షల అనంతరం రజనీకాంత్ తలలోని రక్తనాళం ఒకటి పగిలిందని, అందుకే ఐసీయూలో ఉంచి పరీక్షలు జరుపుతున్నట్లుగా రజనీ సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న తాజా సమాచారం. దీనికి భయపడాల్సిన అవసరం లేదని, ఇది అందరిలో సాధారణంగానే జరుగుతుందని, ప్రస్తుతం రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

ఇక రజినీకాంత్ నటించిన ‘అణ్ణాత్త’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలకాబోతోంది. తెలుగులో ఈ చిత్రం ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్, ‘రా సామి’ లిరికల్ సాంగ్‌లను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇవి రెండూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతున్నాయి. ఇందులో రజనీకాంత్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది.