Education department: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక జీవో జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో భోదించే టీచర్ల ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆస్తులు అమ్మాలి అనుకున్నా, కొనాలి అనుకున్నా వాటి వివరాలను కచ్చితంగా చెప్పాలని, అలాగే ఏడాదికి ఒకసారి తమ ఆస్తుల వివరాలు సమర్పించాలని టీఎస్ విద్యాశాఖ స్పష్టం చేసింది. టీచర్ లకు, ఉద్యోగులకు ఇన్ స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీలు డీఈఓలకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా అనుమతి తీస్కున్న తర్వాతే స్థిర, చర ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. ఇన్నేళ్లు ఉపాధ్యాయుల విషయంలో అంతగా పట్టించుకోని విద్యాశాఖ.. నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్సు శాఖ రిపోర్టు ఇవ్వడంతో.. విద్యాశాఖ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. జావీద్ అలీ పాఠశాల విధులకు హాజరు కాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్ బోర్డు సెటిల్ మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ జావీద్ అలపై ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేలింది. అందుకే విద్యాశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.