Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల జరిగి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. మంచు విష్ణుకి ప్రత్యర్థిగా నిలబడిన ప్రకాశ్ రాజ్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ప్రకాశ్ రాజే కాదు.. ఈ ఎన్నికలు గమనించిన వారందరికీ కూడా ఏదో జరిగిందనే అనుమానం అయితే ఉంది. నాన్ లోకల్ ఇష్యూతో ప్రకాశ్ రాజ్ ఓడిపోయాడని అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ రివీల్ చేస్తున్న ఆధారాలను చూస్తుంటే.. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందనేది అర్థమవుతుంది.
అయిపోయిందేదో అయిపోయింది.. బాధ్యతలు తీసుకున్న విష్ణుతో కలిసి పనిచేయాలని ప్రకాశ్ రాజ్ సానుభూతిపరులు కూడా అనుకుంటున్న సమయంలో రౌడీ షీటర్ నూకల సాంబశివరావు ఉదంతం మళ్లీ ఇప్పుడు ‘మా’లో రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. రౌడీ షీటర్, వైఎస్సార్ సీపీ నాయకుడైన నూకల సాంబశివరావు ‘మా’ ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ బూత్‌లో ఉన్నట్లుగా ప్రకాశ్ రాజ్ కొన్ని ఆధారాలను బయటపెట్టారు. దీంతో అసలు ఈ ఎన్నికలు సజావుగా జరగలేదని, ప్రకాశ్ రాజ్ పోరాటంలో అర్థం ఉందనేలా.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.
ఇదిలా ఉంటే.. ‘మా’ ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ మార్చే మాటలు కూడా ఈ ఎన్నికలపై అనుమానాలను పెంచుతున్నాయి. ప్రకాశ్ రాజ్ అడిగిన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో ఆయన ఇప్పటికే పలు రకాలుగా మాటలు మార్చాడు. ‘లా’ ప్రకారం ప్రకాశ్ రాజ్ అడిగిన సీసీటీవీ ఫుటేజ్ ఇస్తానని మొదట చెప్పిన కృష్ణమోహన్.. ఆ తర్వాత అది ఇవ్వడం కుదరదని, కావాలంటే కోర్టుకు పొమ్మనేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు, తాజాగా అసలు అది నా పరిధే కాదంటూ చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఈ ఎన్నికలను ఎలా నిర్వహించాడో అర్థమయ్యేలా చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌నే ఒకరోజులో పూర్తి చేస్తుంటే.. 600 ఓట్లు కూడా లేని ‘మా’ ఓట్ల లెక్కింపును ఆయన మరుసటి రోజుకు వాయిదా వేసినప్పుడే.. కృష్ణమోహన్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్‌తో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది.
దీంతో ఇప్పటి వరకు మంచు విష్ణుకు సపోర్ట్ చేసిన వారు కూడా ‘మా’ ఎన్నికల అధికారి వ్యవహరిస్తున్న తీరుపై బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని, ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే ఆయన బై లాస్‌ను తుంగలో తొక్కారని ఓ కల్యాణ్ వంటి వారు డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి ఆధారాలు చూపిస్తున్నారు. కృష్ణమోహన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా.. డీఆర్‌సీ పెద్దలైన కృష్ణంరాజు వంటివారు మాట్లాడకపోవడం విడ్డూరమనే చెప్పాలి. దీనికి మళ్లీ డీఆర్‌సీ కమిటీలు ఎందుకో అనేలా స్వయంగా ‘మా’ సభ్యులే అనుకుంటుండటం విశేషం. కాబట్టి, ఈ విషయాన్ని ఇంతటితో సద్దుమణిగేలా చేస్తే బాగుంటుంది.. లేదంటే టాలీవుడ్ పరువు మరోసారి వారంతట వారే తీసుకున్నవారవుతారని తెలుసుకుంటే మంచిది.
Read Also : RGV Etala Movie: ‘వెన్నుపోటు ఈటలు’ మూవీ.. అసలు విషయం చెప్పేసిన ఆర్జీవీ