Snake fest: కొన్ని పండగలు, ఆచారాలు భలే వింతగా ఉంటాయి. అయితే కొత్తగా చూసే వారికి వింతగా అనిపించినా.. అవి పాటించే వారికి మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటుంది. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్ చౌక్ మండలం ఆగాపూర్ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఓ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నాగ పంచమి రోజు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పాలు పట్టుకుని పుట్ట వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి ఆ దేవతను ఆరాధిస్తారు. కోరుకున్న కోరికలు తీర్చమని వేడుకుంటారు. అయితే బీహార్ లోని ఆగాపూర్ గ్రామంలో నాగ పంచమి వేడుకలు కొంత భిన్నంగా జరుగుతాయి. కానీ చాలా ఘనంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు.
భగత్ అని పిలిచే పూజారాలు గ్రామంలోని భగవతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం డప్పు వాయిద్యాలతో గండక్ నది వద్దకు చేరుకుంటారు. నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అనంతరం నీటి లోపలి నుండి పాములను బయటకు తీసి వేడుక చేస్తారు. ఇలా పాములు తీయడాన్ని అక్కడి ప్రజలు పుణ్య కార్యంగా భావిస్తారు. భగత్ లు ఇలా పాములు తీయగానే గ్రామస్థులు చప్పట్లు, ఈలలు, కేకలతో సంతోషం వ్యక్తం చేస్తారు. కొందరైతే నోటితోనూ పాములను పట్టుకుంటారు. ఈ పాములతో విన్యాసాలు చేస్తూ గ్రామంలోకి వెళ్తారు. ఈ పాములకు కొన్నింటికి విషం ఉంటుంది. అయినా ఆ పూజారులు ఎవరూ భయపడరు. ఆ పాములు కూడా వారిని ఏమీ అనవని అక్కడి వారు చెబుతుంటారు. వేడుకల తర్వాత ఆ పాములను తీసుకెళ్లి పొదల్లో వదిలి పెడతారు.దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.