Credit Card: క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ ఇటీవలే కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా క్రెడిట్ కార్డు వ్యాపార నిర్వహణకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు… క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు బకాయి పడిన రోజుల గురించి సమాచారం ఇవ్వాలి. ఆ పాస్ట్ డ్యూ మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఖాతాదారులపై ఛార్జీల వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గడువులోపు మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే.. అప్పుడు మీ క్రెడిట్ కార్డు ఖాతాను పాస్ట్ డ్యూగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు రిపోర్ట్ చేసి ఛార్జీలు విధిస్తుంది.
అయితే కొత్త నిబంధనల ప్రకారం బకాయి చెల్లించాల్సిన తేదీకి మూడు రోజుల తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతేనే ఆలస్య రుసుము, వడ్డీ వంటి ఛార్జీలను విధించాల్సి ఉంటుంది. అంటే బిల్లు కట్టే గడువు దాటినా కూడా.. మూడు రోజుల్లోపు ఎలాంటి ఛార్జీలు లేకుండానే కార్డుదారులు ఆ బిల్లును చెల్లించుకోవచ్చు.
అయితే మూడ్రోజుల తర్వాత కార్డు బిల్లను గనుక చెల్లిస్తే.. ఆలస్య రుసుము ఛార్జీలను క్రెడిక్ కార్డు స్టేట్ మెంట్ లో పేర్కొన్న గడువు తేదీ నుంచి లెక్కిస్తారు. అయితే ఈ ఛార్జీలు కూడా కేవలం అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద మాత్రమే వేయాల్సి ఉంటుంది. అంతేగానీ మొత్తం బాకీ మీద వసూలు చేయకూడదని ఆర్బీఐ వెల్లడించింది.