Ram Gopal Varma : ఏపీలోని థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ తగ్గింపు విషయమై వివాదం రాజుకున్న సంగతి అందరికీ విదితమే. ఈ విషయంలో ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూరిపోయి సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు, వర్మ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. కాగా, తాజాగా వర్మ ఏపీ సీఎం జగన్‌పైన ఓ మీడియా చానల్‌లో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటంటే..
మొన్నటి వరకు ఏపీలోని జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్లు కనబడిన వర్మ.. సినిమా టికెట్ల ధరల విషయంలో మాత్రం వ్యతిరేకిస్తున్నారు. జగన్ సర్కారును ట్వీట్స్‌తో పాటు మీడియా చానల్స్ డిస్కషన్స్‌లో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా జగన్ సర్కారును ఇబ్బందుల పాలు చేసే క్రమంలోనే వర్మ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని మాత్రం ప్రశంసించారు.
అందరిలాగా కాకుండా పేర్ని నాని మర్యాదతో సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమ తరఫున తమకున్న సమస్యలు వివరించే ప్రయత్నం చేస్తానని పేర్కొనగా, త్వరలోనే కలుద్దామని మంత్రి సమాధానమిచ్చారు. ఈ సంగతులు అటుంచితే.. వర్మ తాజాగా ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడారు.
వైసీపీలో తాను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్ జగన్ అని, అయితే, ఆయన చుట్టూ ఉన్న వైసీపీ లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు వర్మ. వైసీపీ నేతలు వాళ్ల పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే జగన్ తన చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నానని వర్మ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, రామ్ గోపాల్ వర్మ వార్నింగ్ పైన వైసీపీ నేతలు కాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాని ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. టికెట్ల ధరల తగ్గింపు విషయమై గత కొద్ది రోజులకు ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.