...

Mamidi thandra: మన్యం మామిడి తాండ్ర అంటే మామూలుగా ఉండదు మరీ.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

Mamidi thandra: మామిడి తాండ్ర.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంది. ఎంత తిన్నా మళ్లీ మళ్లీ కొరకాలనిపిస్తుంది. అలాంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారు చేసే ఈ మామిడి తాండ్ర రుచి గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వేసవి వచ్చిందంటే చాలు మన్యంలో మామిడి తాండ్ర తయారీ మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు.

వారపు సంతలో కిలో తాండ్ర 100 రూపాయలు పలుకుతోంది. డిమాండ్ కు తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు. అయితే ఇందుకోసం అటవీ ప్రాంతంలో పండించే పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాలు, బిందెల్లో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎలాంటి రసాయనాలు కలపకుండానే పొరలు పొరలుగా పోస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు.

అలాగే మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేయగా… మిగిలిన పెంకలు, తొక్కలను వేరు చేస్తారు. అయితే తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవుగా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడకబెట్టి అంబలిగా చేసుకొని తాగుతుంటారు. అలాగే మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేసుకొని లొట్టలేసుకుని మరీ ఆరగిస్తుంటారు. అయితే ఈ మామిడి తాండ్ర కిలో 100 రూపాయల నుంచి 120 వరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.