...

MP Raghu Rama Krishna Raju : ఏపీలో అందరి చూపు రఘురామరాజు వైపే.. రాజీనామా చేస్తారా?!

MP Raghu Rama Krishna Raju : అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్ష టీడీపీ పెద్దగా ఎదుర్కొనలేకపోయింది. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలోనూ తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఫలితంగా అక్కడ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ పార్టీ గెలుస్తూ వచ్చింది. అయితే, వైసీపీని ఇరకాటంలో పెట్టడంలో మాత్రం ఒక్కరే ఒక్కరు సక్సెస్ అయ్యారు.

ఆయన మరెవరో కాదు నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణంరాజు.. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గెలుపొందిన ఆర్ఆర్ఆర్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తనపై కేసులు పెట్టించినా, అరెస్టు చేయించినా, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని చూసినా ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఫలితంగా జగన్ తన ఓటమిని ఒప్పుకుని రఘురామ జోలికి వెళ్లడం మానేశారు.

అయితే, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రాజీనామా చేయనున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల తిరుపతిలో పర్యటించిన కేంద్రహోంశాఖ మంత్రి బలమైన లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే వైసీపీకి రెబల్‌గా మారిన రఘురామను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆయన్ను కలిసి బీజేపీలో చేరే విషయంపై మంతనాలు కూడా చేసినట్టు సమాచారం. దీంతో ఈనెల 17న లేదా 25న ఆర్ఆర్ఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

న్యాయస్ధానం టు దేవస్థానం పేరుతో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న పాదయాత్ర ముగింపు సభ ఈనెల 17న తిరుపతిలో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున ఎంపీ తన పదవికి రాజీనామా చేసే విషయమై బహిరంగసభలో ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఆరోజు కాకపోతే 25న మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతి సందర్భంగా పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఎంపీ రాజీనామా చేస్తే ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య వార్ కొనసాగుతుందా..? టీడీపీ కూడా తన పవర్ ఏంటో చూపిస్తుందా? అనే తేలాలంటే వేచిచూడాల్సిందే.

Read Also : Chandrababu : 2024 ఎన్నికలే టార్గెట్.. ఏరివేతలు షురూ చేసిన చంద్రబాబు?