...

Lata Mangeshkar : లతా మంగేష్కర్ ఇకలేరన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానన్న సీఎం జగన్…

Lata Mangeshkar : లతా మంగేష్కర్‌ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్ వయసు ఇప్పుడు 92 ఏళ్లు. ఆమె 1929లో ఇండోర్లో జన్మించారు. ఆమె అసలు హేమ మంగేష్కర్. అయిదుగురి పిల్లల్లో పెద్దకూతురు. ఆమెకు ముగ్గురు చెల్లెళ్లు. ఒక తమ్ముడు. 13 ఏళ్లకే తండ్రి గుండె పోటుతో మరణించడంతో చాలా కష్టాలు పడింది లతా కుటుంబం. అందుకే చిన్న వయసులోనే సినిమాల్లో నటించడం, పాడడం మొదలుపెట్టారు లతా. 1942లో మొదలుపెట్టిన ఆమె కళా ప్రయాణం ఇప్పటి వరకు సజీవంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు లతాజీ భౌతికంగా మరణించినా, ఆమె పాటల రూపంలో అభిమానుల చెవుల్లో వినిపిస్తూనే ఉంటారు.

లతా మంగేష్కర్ ఇకలేరన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం జగన్ అన్నారు. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు అన్నారు. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు 980 సినిమాల్లో లతా పాటలు పాడారు. దాదాపు ఆ పాటల సంఖ్య 50 వేలకు పైనే ఉంటాయి. చెల్లెలు ఆశా భోంస్లేను కూడా తన దారిలోనే నడిచించారు లతాజీ. వీరి కుటుంబం సినీ సంగీత ప్రపంచానికి చేసిన మేలు ఎంతో. 2001లోనే భారతరత్న అందుకున్నారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ కూడా గతంలోనే అందుకున్నారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం ద లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారంతోనూ సత్కరించింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.