మొన్నటి వరకు ఏపీలో పీఆర్సీపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని సీఎం జగన్ భావించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఉద్యోగులు డిమాండ్ చేసిన దానికంటే తక్కువగానే పీఆర్సీ ప్రకటించారు. ఇదే టైంలో ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగుల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. తమ ఉద్యోగ విరమణ వయస్సు మరో రెండు సంవత్సరాలు పెరగడంతో చాలా మంది ఉద్యోగుల్లో ఆనందం వెళ్లివిరిసింది. కానీ ఈ విషయంలో కొందరు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తమకు తెలుసని చెప్పకనే చెబుతున్నారు.
తెలంగాణలోనూ ఉద్యోగుల విరమణ వయస్సును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్‌లు రావడం లేదని ఆవేదనతో ఉన్న నిరుద్యోగులకు ఇది మంట పెట్టినట్టుగా మారింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన తీర్పు ఇంకా వెలువడలేదు. ఏపీలోనూ ఉద్యోగుల విరమణ వయస్సు పెంచడంతో నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించే చాన్స్ ఉంది. ఆ టైంలో వైసీపీకి దెబ్బపడడం ఖాయం. ఎందుకంటే తీర్పు ఉద్యోగుల వయస్సును తగ్గించి పాత పద్ధతినే కొనసాగించాలని వస్తే.. ప్రభుత్వం రెండు విధాలుగా నష్టపోయే ప్రమాదముంది. ఎందుకంటే ఉద్యోగులకు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి రెండు సంవత్సరాల సర్వీసును వెనక్కి తీసుకుంటే వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదముంది. మరో వైపు కోర్టు తీర్పుతో నిరుద్యోగులు కాస్త సంతోషం వ్యక్తం చేసినా ఆ క్రెడిట్ కోర్టుకే దక్కుతుంది. ఎందుకంటే కోర్టు జోక్యం వల్లే ఉద్యోగ విరమణ వయస్సును తగ్గించిందని, ఇందుకు ప్రభుత్వం చేసిందేమీ లేదని నిరుద్యోగులు భావించే చాన్స్ ఉంది. దీంతో ఇటు నిరుద్యోగులు, అటు ఉద్యోగులు ప్రభుత్వానికి దూరమయ్యే చాన్స్ ఉంది.