CM KCR : హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు అధికార పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. వందల కోట్లు ఖర్చుచేసిన నియోజకవర్గంలో ఈటల చేతిలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ అవమానకరంగా భావిస్తున్నారని తెలిసింది. అందుకోసమే వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ బీజేపీ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాడని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నిరోజులు ప్రతిపక్షాలు ఏమన్నా లైట్ తీసుకున్నానని, ఇకపై ఊరుకోనని మీడియా ముఖంగా హెచ్చరించారు. రైతుల గురించి మాట్లాడుతూనే కేంద్రంతో ఇకపై యుద్దం చేస్తానని ప్రకటించారు. రైతులు వరి వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెగేసి చెప్పారు.
ఈటల రాజేందర్‌ను కేసీఆర్ తన మిత్రుడిగా చాలా సార్లు చెప్పుకొచ్చారు. కానీ, ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించడం, పార్టీ నుంచి బహిష్కరించడం తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈటల బీజేపీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ‘ఆత్మగౌరవం’నినాదంతో మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అయితే, కేసీఆర్ ప్రస్తుతం ఈటలపై రివేంజ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈటల సతీమణి పేరిట ఉన్న జమునా హ్యాచరీస్‌కు అధికారులు మరోసారి నోటిసులు ఇచ్చారు. మెదక్ జిల్లాలోని అసైన్డ్ భూములు ఆక్రమణ వ్యవహారంలో ‘సర్వే చేయాలి.. 18వ తేదీన రావాలని’ ఈటల కుమారుడికి ఆర్డీవో నోటీసులు ఇచ్చారు.
మాసాయిపేటలోని ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి అసైన్డ్ భూములను ఈటల అక్రమంగా లాక్కున్నారని ప్రజల ఫిర్యాదు అందిందని మీడియాలో వార్తలు ప్రసారం కాగా ఈటలను మంత్రి పదవి నుంచి కేసీఆర్ తొలగించారు. ఆ తర్వాత ఈటల కోర్టుకు వెళ్లడం స్టే తేవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఎన్నికలు అయిపోయాక మరోసారి విచారణ పేరుతో ఈటలను, బీజేపీ పార్టీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావించినట్టు తెలిసింది. అందుకే రివేంజ్ పాలిటిక్స్‌కు తెరలేపారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, దీనిపై ఈటల రాజేందర్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
Read Also : CM KCR : హుజురాబాద్ ఎఫెక్ట్‌తో రంగంలోకి కేసీఆర్.. టార్గెట్ బీజేపీగా సరికొత్త వ్యూహం
Tufan9 Telugu News providing All Categories of Content from all over world