Union Budget 2022 : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2022 ఆశాజనకంగా లేదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు.పేద వర్గాలు, కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్‌లో చెప్పలేదని, జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేసిందని విశ్లేషించారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో ఆహార సబ్సిడీని తగ్గించడం ప్రజలపై భారం మోపడమేనన్నారు.
బడ్జెట్ నిరుత్సాహ పరిచింది : ఎంపీ విజయసాయిరెడ్డి
ఈ బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచిందని బడ్జెట్‌పై ఢిల్లీలో స్పందించిన వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. అప్పులు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని కేంద్రం నిబంధన పెట్టిందని కాంగ్రెస్ కేంద్రం మాత్రం అదే పనిగా అప్పులు చేస్తోందని… ఎఫ్ఆర్‌బీఏం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి మించి రుణాలు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైఎస్ఆర్‌సీపీ విఫలం : చంద్రబాబు నాయుడు
సంస్కరణలు, నదుల అనుసంధానం విషయంలో కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వాగతించారు. కృష్ణా – గోదావరి నదుల అనుసంధానానికి పట్టిసీమ ద్వారా నాంది పలికామని ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వేయటంపై ఆనందం వ్యక్తం చేశారు. విద్యుత్ వాహనాలు, డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలని అన్నారు.
సోలార్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ముందుకు రావడం సముచితమన్నారు. అయితే బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వైఎస్ఆర్‌సీపీ విఫలమయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 28 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని.. . ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో.. సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
Read Also : మీ ఇంట్లో ఇవి ఉంటే.. అన్నీ శుభాలే.. చేతి నిండా డబ్బు..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World