Tirupati: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తిరుపతిలో కొలువై ఉన్న స్వామివారి దర్శనార్థం రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొంటారు. ఈ విధంగా భక్తులకు కోరిన కోర్కెలను నెరవేర్చే వారికి కొంగుబంగారం చేస్తున్న వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో మంది భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా స్వామివారికి ముడుపు చెల్లించడం అంటే ఏమిటి? ఈ ముడుపును ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు స్వామివారిని నమస్కరించుకుని ఆ కష్టాలు తొలగిపోతే నీ కొండకు వచ్చి మొక్కు చెల్లించుకుంటామనీ మొక్కుకొని స్వామివారికి శనివారం ముడుపు కట్టాలి. ఇలా ముడుపులోకి 11 రూపాయలు ఇరవై ఒక్క రూపాయి ఇలా మనకు తోచినంత ముడుపు చెల్లించాలి. ముందుగా ఈ ముడుపు కట్టడం కోసం ఒక తెల్లటి వస్త్రాన్ని తేమ చేసి దానికి మొత్తం పసుపు రాయాలి. ఇలా పసుపు రాసిన ఆ గుడ్డను ఆరబెట్టి ఆరిన అనంతరం నాలుగు మూలల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక శనివారం పూజ చేసిన అనంతరం ఆ వస్త్రంలో మనం చెల్లించాల్సిన ముడుపు వేసి ఆ వస్త్రాన్ని మూడు ముడులు వేయాలి. ఇలా ముడుపు కట్టిన ఆ డబ్బును వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి తమ కష్టాలు, ఇబ్బందులు తీరినప్పుడు ఈ ముడుపుతో కొండకు వస్తానని మొక్కు తీర్చుకోవాలి.మన కష్టాలు తీరిన తర్వాత ఆ ముడుపుతో స్వామివారి ఆలయానికి వెళ్లి ముడుపుతో పాటు మరి కొంత డబ్బు వడ్డీగా చెల్లించినప్పుడు స్వామి వారి అనుగ్రహం మనపై ఉంటుందని పెద్దలు చెబుతారు.