అమెరికా వెళ్లి చదవాలనుకునే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. యూఎస్ వెళ్లి చదవాలనుకునే వారికి వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది. అక్కడి పలు యూనివర్సిటీలు ఇప్పటికే ఐ-20 ధ్రువపత్రాల జారీని ముమ్మరం చేశాయి. డిల్లీలోని అమెరికా ఎంబసీ ఆఫీస్ తో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్ కతాలోని కాన్సులేట్ ఆఫీసుల్లో వీసా స్లాట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విద్యార్థులక వీసాలకు డిమాండ్ భారీగా ఉండటంతో కొన్ని ఆంక్షలు సైతం విధించాలని యూఎస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఒక సీజనులో ఒక దఫా మాత్రమే విద్యార్థి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేలా చూడనున్నట్లు తెలిసింది. సాధారణంగా ఒక సారి వీసా తిరస్కరణకు గురైన తరవాత కొద్ది రోజుల వ్యవధిలో అదే కాన్సులేట్ లేదా ఇతర కార్యాలయాల్లో ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవటం ఇప్పటి వరకు పరిపాటిగా ఉంది. ఈ విధానంతో ఇంటర్వ్యూ స్లాట్లు లభించక ఇతర విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయి.
అధికారిక సమాచారం లభిస్తే కాని విధి విధానాలపై స్పష్టత రాదు. 30 శాతం వరకు అదనంగా… ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు వీసా స్లాట్లను కనీసం 30 శాతం అదనంగా కేటాయించేందుకు అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కరోనా ముందు వరకు రోజుకు 600-800 వరకు వీసా స్లాట్లు కేటాయించే వారు. కరోనా సమయంలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా ఆ సంఖ్యను వెయ్యికిపైగా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.