Constable crying: భోజనం బాగాలేదని వలవలా ఏడ్చిన పోలీస్ కానిస్టేబుల్..!

Constable crying: ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో భోజనం ప్లేటు పట్టుకొని మరీ రోడ్డు మీదకు వచ్చాడు. గట్టి గట్టిగా ఏడుస్తూ… ఈ భోజనం చూడండి బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు చెప్పినా వినకుండా వలవలా ఏడ్చాడు. కానిస్టేబుల్ ఏడుపు చూసి కొందరు లోలోపలే నవ్వుకోగా, కొందరు ఏడవద్దంటూ సలహాలు ఇచ్చారు. అయితే పోలీస్ మెస్ లో భోజనం చాలా బాగుంటుందని, నాణ్యమైన ఆహారం పెడతారని అందరూ భావిస్తుంటారు కానీ అలా ఏం ఉండదని చెప్పాడు. ఈ భోజనం ఎంత దారుణంగా ఉందో చూడండంటూ ప్లేట్ ను రోడ్డుపై ఉన్న వారందరికీ చూపించాడు.

అలాగే భోజనం బాగా లేదన్న విషయాన్ని పైఅధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నాడు. అంతే కాదు ఇలా ఫిర్యాదులు చేస్తున్నందుకు తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్లు వివరించాడు. అదీగాక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కూడా రాష్ట్ర పోలీసులకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారని గుర్తు చేశాడు.

అయితే కానిస్టేబుల్ బోరుమని విలపించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ విషయమై ఫిరోజాబాద్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి.. సదరు కానిస్టేబుల్ పై విధులకు హాజరు కాకపోవడం, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినందుకు గతంలో 15 సార్లు పనిష్మెంట్ పొందిన చరిత్ర ఉందని… చెప్పుకొచ్చారు. అయినా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు వివరించారు.