Lordkrishna : శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి. గిట్టనివారికి కపట నాటక సూత్రధారి. విలక్షణమైన వ్యక్తిత్వంతో మాయచేసే గమ్మత్తయిన వాడు కాబట్టే ఆయనంటే అంత ఆకర్షణ. ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది. మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది. శ్రీకృష్ణ నామం ఎంతో మధురమైనది. ఆ వేణుగానం మధురాతి మధురం. ఆయన రూపం అత్యంత ఆకర్షణీయమైనది. ఆయన లీలలన్నీ ఆధ్యాత్మిక భావగర్భితాలు. అందులోనూ ఆయన చోరలీలలు అనూహ్యమైన ఆధ్యాత్మిక సత్యాలతో నిండి ఉంటాయి.

గోపికలు ఆవుపాలు పితకడానికి ముందే అల్లరి కృష్ణయ్య లేగదూడల తాళ్ళు విప్పి వదిలేశాడు. దానర్ధం ఏంటంటే.. కట్టబడి ఉన్న దూడ.. కర్మబంధాలతో బంధింపబడి ఉన్న జీవత్మ. ఆవుదూడ అంబా అని పిలిచిన వెంటనే.. చిన్ని కృష్ణుడు దూడతాళ్ళను విప్పినట్టే మనం కూడా ఆయన్ను ఆర్తితో పిలిస్తే కరుణించి.. మనల్ని బంధవిముక్తుల్ని చేస్తాడన్నది ఈ లీల తెలిపే ఆధ్యాత్మిక సందేశం.
ఒక గోపిక ఇంట్లో ఉట్టికి కట్టిన కుండను తన మిత్ర బృందం సహకారం తో రాయితో కొట్టి.. ఆ కుండనుంచి ధారగా కారుతున్న పాలను కొంటెగా పానం చేశాడు ఆ అల్లరి కృష్ణుడు. దాని అంతరంగం ఏంటంటే.. జ్ఞానం అనే పాలు శాస్త్రాలు అనే కుండలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ జ్ఞాన క్షీరాన్ని పొందాలంటే.. జిజ్ఞాస అనే రాయిని విసిరి దాన్ని పానం చేయాలన్న విషయాన్ని ఈ లీల మనకు తెలియజేస్తోంది.ఇక కన్నయ్య వెన్న దొంగిలించడం అందరికీ తెలిసిన లీలా వినోదమే.
ఇంతకీ ఆయన గోపికల ఇంట్లో కుండల్లో ఉన్న వెన్నను చేత్తో తీసుకొని ఎందుకు తిన్నాడు? ఆ కుండలో తన చిట్టి చెయ్యిని ఎందుకు పెట్టాడు? ఇదే విషయాన్ని ఆ గోపిక అడిగితే దానికి ఆయన ఏం చెప్పాడో తెలుసా? తాను కుండలో చెయ్యి పెట్టింది వెన్న తినడానికి కాదని, అందులో ఉన్న చీమల్ని తీసేయడానికని చెప్పి .. తప్పించుకున్నాడు. అసలు అందులో దాగి ఉన్న అంతర్గత సత్యమేంటంటే .. ఈ మానవదేహమే కుండ. మనస్సే కుండలోని వెన్న. చీమలు విషయ వాంఛలు. కరుణామయుడైన ఆ కృష్ణ పరమాత్ముడు మన మనస్సుల్లోని విషయవాంఛల్ని తొలగిస్తాడని దానర్ధం.

గోపాలుని దొంగతనం గురించి గోపికలు యశోదా దేవికి పిర్యాదు చేయడం కేవలం ఒక నెపం మాత్రమేనట. నిజానికి కన్నయ్య ముగ్ధమనోహర రూపాన్ని దర్శించాలన్నదే ఆ గోపికల అభిమతమట. సాధకుడు ఆధ్యాత్మిక పథంలో ఉన్నతి సాధించడానికి అనుసరించే యోగాలు చాలా ఉన్నాయి. కానీ సాధకుడు ఏ కష్టం లేకుండా ఓ కొత్త యోగాన్ని గోపాలుడు ప్రవేశపెట్టాడు అదే చోర యోగం. ఇంతకీ దీని ప్రాశస్త్యం ఏంటి అని ప్రశ్నించుకుంటే.. ఏ యోగాన్ని అభ్యసించినా.. సాధకుడు తన మనస్సు పరిశుద్ధం కావడానికి సాధన చేయాలి. కానీ ఈ చోరయోగంలో సాధకుడు ఏమీ సాధన చేయనవరం లేదు.
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి మనసనే వెన్నను స్వాధీనం చేసుకుంటాడు. అంటే మనసంతా భగవత్ చింతనతో నిండిపోతుంది. అందుకే మన మనస్సనే మందిరాన్ని పరిశుద్ధం చేసి.. అందులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించాలని సాధన చేస్తాం. కానీ గోపికలకు తమకంటూ ఒక మనస్సనేదే లేకుండా.. ఆ గోపాలుడే వారి మనసుల్ని ఆధీనం చేసుకున్నాడు. అందుకే గోపికలు ఏ పని చేయడానికి సంకల్పించినా.. అక్కడ ఆ గోపాలుణ్ణే దర్శించేవారు. అలా.. గోపికల చిత్తాల్ని హరించి వారి జన్మల్ని తరింపచేసిన కన్నయ్య.. మనపై కూడా చోరయోగాన్ని ప్రయోగించి.. మన మనసుల్ని కృష్ణ మయం చేయాల్సింది గా.. ఆయన చరణాల వద్ద ప్రణమిల్లి ప్రార్ధిద్దాం… నందకిశోరా… నవనీత చోరా. కృష్ణం వందే జగద్గురుం.. ఓం నమో భగవతే వాసుదేవాయ.
Read Also : Garuda Puranam : ఇలాంటి అలవాట్లను వదిలేయండి.. మీ ఇంట్లో సమస్యలకు సంకేతాలివే!