Devotional Tips: సాధారణంగా మనం పలు విషయాలలో ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన పెద్దవారు ఏడాదిపాటు మన ఇంట్లో పూజా కార్యక్రమాలు చేయకూడదని చెబుతూ పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఎత్తి పెడతారు. ఈ విధంగా చనిపోయిన ఇంటిలో పూజా కార్యక్రమాలు చేయకూడదని పెద్దలు వాదిస్తూ ఉంటారు. కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా కొత్త బట్టలను ధరించకూడదని, అలాగే ఆలయాలకు కూడా వెళ్లకూడదని చెబుతుంటారు.నిజంగానే ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏడాది పాటు ఈ పనులు చేయకూడదా అసలు చేస్తే ఏం జరుగుతుంది… ఈ విషయాల గురించి శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం….
శాస్త్రం ప్రకారం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏడాది పాటు పూజలు చేయ కూడదని ఎక్కడా లేదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో పదకొండు రోజులపాటు సంతాపదినాలు జరుపుకుంటారు. పదకొండు రోజుల తర్వాత ఇంటిని మొత్తం శుద్ధి చేసుకుని 12వ రోజు యధావిధిగా మనం చేసే పూజా కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. అంతేకానీ ఎక్కడ కూడా ఏడాదిపాటు ఎలాంటి పనులు చేయకూడదని శాస్త్రంలో ఎక్కడ లేదని పండితులు తెలియజేస్తున్నారు.
ఏడాది పాటు మన ఇంట్లో దీపారాధన చేయకపోవటం వల్ల ఇంట్లో ఎంతో అరిష్టం కలుగుతుంది. ఇలా దీపారాధన చేయకుండా ఉండటం మంచిది కాదు.ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. కనుక ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయిన 11 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకుండా 12వ రోజు నుంచి పూజా కార్యక్రమాలు చేయవచ్చు. అయితే కొత్తగా ఏదైనా హోమాలు, పూజలు, అలాగే శుభకార్యాలను చేయకూడదు కానీ మన ఇంట్లో నిరంతరం చేసుకొనే పూజలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు. ఇలా చేయకపోవడం వల్ల అరిష్టం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.