...

Shigella: కేరళలో మళ్లీ వెలుగు చూసిన షిగెల్లా.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Shigella: దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో ప్రజలలో కొత్త లక్షణాలు కనిపించినా కూడా అది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఏమో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో కేరళలో మళ్లీ షిగెల్లా వెలుగులోకి వచ్చింది. కోజికోడ్‌లోని పుత్తియప్పకు చెందిన ఏడేళ్ల బాలికలో షిగెల్ల లక్షణాలు ఉండటంతో వైద్యులు అనుమానం వచ్చి పరీక్ష చేయగా షిగెల్ల వ్యాధి నిర్ధారణ అయింది. ఆ చిన్నారితో పాటు తన ఇంటి పక్కన నివసిస్తున్న మరొక చిన్నారిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ షిగెల్లా లక్షణాలు ఏమిటి ? ఇది ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ షిగెల్ల వ్యాది సోకినప్పుడు జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కొన్ని సందర్భాలలో కలుషిత ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీరు తాగడం వల్ల వాటిలో ఉండే క్రిముల కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వ్యాధి సోకినప్పుడు దీని ప్రభావం కారణంగా పిల్లలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ కాంటాక్ట్ లో ఉండటం వల్ల ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

ఈ షిగెల్ల వ్యాది సోకిన ఏడు రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ వ్యాధి సోకినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధి సోకిన వారు కొన్ని నియమాలు పాటించడం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కుని ఇతరులకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా శుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ.. తరచూ వేడి నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కడపడితే అక్కడ బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన చేయటం వల్ల ఇతరులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.