...

Covid-19 Vaccine : ఇండియాలో పిల్లల కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి..!

Covaxin emergency use Kids : ఇండియాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. చిన్నపిల్లలు మినహా పెద్దవాళ్లలో అన్నివయస్సు వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది.

కొవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకు అందించేందుకు అనుమతి లభించినట్టు తెలుస్తోంది. రెండు ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు లోపు పిల్లలకు ఈ కోవాగ్జిన్ టీకాను వినియోగించవచ్చు. పిల్లలకు 0.5ml డోసు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

2 ఏళ్ల నుంచి 18ఏళ్ల వయస్సు వరకు ఉన్న చిన్నారులకు అందించే టీకా కోవాగ్జిన్ కానుంది. హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత బయోటెక్ సెప్టెంబర్ నెలలోనే 18ఏళ్ల లోపు చిన్నారులకు కోవాగ్జిన్ రెండో దేశ, మూడో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసింది.

అక్టోబర్ నెల మొదటివారంలో డ్రగ్స్ అండ్ కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ట్రయల్ డేటాను సమర్పించింది. ఈ డేటాను పరిశీలించిన అనంతరం సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి కోవాగ్జిన్ టీకాకు ఆమోదం తెలిపింది. రెండేళ్ల నుంచి 18ఏళ్ల పిల్లలకు ఈ టీకాను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కూడా కమిటీ సిఫారసు చేసినట్టు తెలిసింది.

కోవాగ్జిన్ మొదటి రెండు డోసుల మధ్య 20 రోజుల గ్యాప్ ఉండాల్సిందిగా కమిటీ తెలిపింది. మొదటిసారి పిల్లలకు టీకా అందించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. పిల్లలపై టీకా పనితీరుకు సంబంధించి సురక్షితమైన డేటాను ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంటుంది.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికీ కూడా కోవాగ్జిన్ కు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపలేదు. ఇప్పటికే భారత బయోటెక్ జూలై 9 లోపు WHO ఆమోద ముద్ర కోసం అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినట్టు తెలిసింది. అనుమతిపై మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు.