Karnataka Man : కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో ఆత్మహత్య కలకలం సృష్టించింది. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన ఇంకా మరవకుండానే బెంగళూరులోని నాగరభావి ప్రాంతంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం (జనవరి 23) జరిగింది. మృతుడికి భార్య విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపింది.
మనస్పర్థలతో విడిగా ఉంటున్న దంపతులు :
మృతుడి భర్త పేరు మంజునాథ్ అని పోలీసులు తెలిపారు. అతడు కుణిగల్ నగర నివాసి. మృతుడికి 39ఏళ్ల వయస్సు ఉంది. వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. 2013లో మంజునాథ్‌కు వివాహమైంది. పెళ్లయ్యాక బెంగళూరులోని ఓ ఫ్లాట్‌లో కాపురం పెట్టాడు. అతనికి 9 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మంజునాథ్ గత రెండేళ్లుగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. దీంతో వారిద్దరూ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు.
Karnataka Man : భార్య ఎదుటే ప్రాణాలు విడిచాడు :
మంజునాథ్ తన భార్య ఇంటికి వెళ్లి కోర్టులో విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దరఖాస్తును ఉపసంహరించు కునేందుకు మంజునాథ్ భార్య సిద్ధంగా లేదు. తన భర్త వల్ల తాను చాలా నష్టపోయానని చెప్పింది. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు భార్య నిరాకరించడంతో మంజునాథ్ పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి ఆమె ఇంటి కారిడార్ ఎదుటే నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలతో మంజునాథ్ మరణించాడు.
మా కొడుకు మృతికి కోడలే కారణం : తల్లిదండ్రుల ఆరోపణ
తమ కొడుకు మృతికి కోడలు కారణమని మంజునాథ్ తల్లిదండ్రులు ఆరోపించారు. జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులోని ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్న అతుల్ సుభాష్ మృతితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భార్య నికితా సింఘానియా తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ అతుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకుల కోసం నికిత తన నుంచి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందని అతుల్ ఆరోపించారు.
Read Also : Tollywood Actress : భర్త ఫొటోలు డిలీట్ చేసిన తెలుగు హీరోయిన్.. విడాకుల తీసుకోబోతుందా ఏంటి? ఆమె ఎవరంటే?