...

దారుణం: ఒక్కరితో అక్రమ సంబంధం వల్ల ముగ్గురు బలి..!

పిల్లాపాపలతో ఆనందంగా సాగుతున్న కుటుంబంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నిలదీయడంతో గొడవ ప్రారంభమై,ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చింది. భార్యాభర్తల గొడవ చివరకు ఒక ప్రాణాలను బలితీసుకుంది.ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వింజమూరు కు చెందిన అబ్దుల్ భాష అనే వ్యక్తి కట్టుకున్న భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సంసారాన్ని గాలికి వదిలేసిన భర్త నిత్యం ప్రియురాలి దగ్గరే ఉండడంతో దంపతుల మధ్య గొడవ జరుగుతుండేది. భర్త ఆగడాలు మితిమీరి పోవడంతో విసిగిపోయిన భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వేరే యువతి తో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని,తనకు అన్యాయం చేస్తున్నాడని నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అబ్దుల్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇద్దరూ కలిసి ఉండాలని చెప్పి పంపించారు.

అయితే తన పైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యపై కోపోద్రిక్తుడైన అబ్దుల్ గొడవకు దిగాడు. దీంతో భార్యా తరపు బంధువులు ఆమెకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలోనే భార్యకు రక్షణగా నిలిచిన బంధువులపై అబ్దుల్ కత్తితో దాడికి దిగాడు. దాడి లో ముగ్గురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని హాస్పిటల్ కి తరలించారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమించి చనిపోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అబ్దుల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి పై హత్యాయత్నం తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వారిని చంపడానికి ప్రయత్నించిన అబ్దుల్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.