Governor tamilisai: వర్షాలు ఎక్కువుగా కురుస్తున్నాయని క్లౌడ్ బరస్ట్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొట్టిపారేశారు. క్లౌడ్ బరస్ట్ కాదు.. ఏం కాదని.. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అంతేనని అన్నారు. యానాంలో పర్యటిస్తున్న ఈ ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ వైన్ లాంటిదని… దానిని ఎట్టి పరిస్థితుల్లో యానాంలోకి అనుమతించమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటిస్తున్నారు.
యానాంలో వరద నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. గతంలోనే ఈ ప్రణాళికకు రూపకల్పన జరిగిందని… కానీ అనివార్య కారణాల వల్ల అది అక్కడే నిలిచిపోయిందని అన్నారు. తాము చాలా దూరంలో ఉన్నా పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తున్నామని తమిళిసై తెలిపారు.
వరద బాధితులతు గవర్నర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వారికి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీస్తున్నారు. గౌతమీ నది ఉద్ధృతితో యానాంలోని పలు కాలనీలు నీట మునిగాయి. నడుములోతు నీళ్లతో స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గోదావరి నది పరివాహకంలో ఉన్న 8 గ్రామాలు నీట మునిగాయి.
గవర్నర్ పర్యటన వేళ యానాంలోని ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ముందు ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఆహార పంపిణీ, బోట్ల విషయంలో గొడవ జరిగింది.