Interesting news: పెళ్లి మండపంలో వేడుక జరుగుతుంది. బంధుమిత్రులంతా హాజరవుతారు. ఇంకాసేపట్లో తాళి కడతారు అనగా పోలీసు ఎంటరవుతారు. ఆపండి అంటారు. ఇదంతా సినిమాల్లో కనిపించే సన్నివేశం. అయితే అలాంటివి నిజ జీవితంలోనూ కొన్ని సార్లు జరుగుతుంటాయి. కట్నం, మర్యాదల విషయాల్లో పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం చాలా చూసే ఉంటాం. అలాంటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పరిధది తాజ్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్తకు 2012 ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. అయితే వేధింపుల కారణంగా 2017లో అతడి భార్య కోర్టు కేసు వేసింది. వారిద్దరికి ఒక కూతురు ఉండగా.. కేసు కోర్టులో ఉండటంతో ప్రస్తుతం వారు విడిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆ వ్యాపార వేత్త మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య బంధువులు పెళ్లి మండపానికి చేరుకోగా.. అప్పటికే తాళి కట్టే తంతు పూర్తయి పోయింది.
మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే పెళ్లికి సిద్ధమైనట్లు తెలియడంతో అరెస్టు చేశారు. అయితే ఏ పాపం తెలియని యువతికి అన్యాయం జరగడంతో పెద్దలంతా కూర్చుని పంచాయతీ చేశారు. చివరకు వ్యాపారవేత్త సోదరుడితో యువతికి వివాహం జరిపించారు. దీంతో మరిదిగా ఉన్న వ్యక్తి భర్తగా మారాడు. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ గా మారింది. డైవర్స్ తీసుకోకుండా రెండో పెళ్లికి సిద్ధమైన సదరు వ్యాపార వేత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.