Cyber crime: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ దగ్గర నుంచి డబ్బులు లాగేశాడో సైబర్ నేరగాడు. స్నేహమంటూ వెంట తిరిగి మరింత డబ్బు కావాలన్నాడు. అతడి గురించి తెలిసిన ఆమె దూరంగా ఉండడంతో… తనతో దిగిన ఫొటోలను భర్తకు పంపాడు. ఇక్కడే ఆ చోరుడు అనుకోని ఓ సంఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెకు విడాకులిస్తాడనుకున్న నేరగాడి నమ్మకాన్ని గంగలో కలిపి… కట్టుకున్న భార్యను అక్కున చేర్చుకున్నాడు. నీకు నేనున్నాను… ఎలాంటి కష్టం రానివ్వనంటూ తోడుగా నిలిచాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి నేరగాడని అరెస్టుకు కారణం అయ్యాడు.
అయితే తాత్కాలికంగా విడిపోయిన భార్యభర్తలు కలవడానికి పరోక్షంగా కారణమైన ఆ నేరగాడిని పోలీసులు… పంజాబ్ లోని మొహాలీలో అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టుకు తీసుకురాగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటూ, విడాకుల ప్రయత్నాల్లో ఉన్న గృహిణికి ఫేస్ బుక్ ద్వారా మొహాలీకి చెందిన పర్మేందర్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. ప్రతి నెలా రూ.2 లక్షల ఆర్జిస్తున్నట్లు చెప్పుకున్న అతగాడు ఆమెతో పెళ్లి ప్రస్తావన చేశాడు. ఆపై నగరానికి రాకపోకలు సాగించి ఆమెతో కొన్ని ఫొటోలు దిగాడు. రెండు సందర్భాల్లో డబ్బు అవసరమంటూ ఆమె నుంచి రూ.70 వేలు తీసుకున్నాడు.
అనుమానం వచ్చి ఆమె అతడి గురించి వాకబు చేయగా… అతడో నేరగాడని తెలిసింది. వెంటనే అతడిని దూరం పెట్టింది. దీంతో కక్ష కట్టిన అతగాడు వివాహితతో దిగిన ఫోటోలను ఆమె, ఆమె భర్త, కుమారుడితో పాటు వారి స్నేహితులకూ పంపాడు. విషయం తెలిసిన బాధితురాలి భర్త ఆమెకు మళ్లీ దగ్గరై మనోబలాన్నిచ్చాడు. ఇద్దరూ కలిసి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు మొహాలీలో పర్మీందర్ ను అరెస్టు చేసి తీసుకువచ్చారు.