Coconut tree burned: తెలుగు రాష్ట్రాలపై అసని తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జోరు వానతో అంతా జలమయం అయింది. పలు చోట్ల పిడుగు పడి చెట్లు నేల కూలాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో… భీకరంగా వీచిన గాలి వాన, పిడుగులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కొత్తపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
జోరుగా కురిసిన వర్షానికి తోడు ఉరుములు బెంబేలెత్తించాయి. దీంతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. కుమ్మరివీధి రామాలయం వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు దాటికి చెట్టుపై మంటలు చెలరేగాయి. కొబ్బరి చెట్టుపై పిడుగు పడిన సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే… పై నుంచి సూర్య రశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న ధనావేశ మేఘాలు పైకి వెళ్తాయి. అధికంగా బరువు ఉండే రుణావేశ ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న మేఘాలు కిందికి వస్తాయి. అంటే, ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మేఘాల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి.
రుణావేశ మేఘాల్లోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశ మేఘాలవైపు ఆకర్షితం అవుతాయి. అయితే, ధనావేశ మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటు వైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదు దూసుకు వస్తాయి. దాన్నే పిడుగు అంటారు. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదల అయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయి.
అలా మేఘాల నుంచి పడే పిడుగులో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. అంటే అది ఒక మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేస్తుంది. ప్రధానంగా ఎండాకాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సముద్రం కంటే కూడా భూమిపైనే ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి.