TS RTC Bus Charges : తెలంగాణకు ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రంలో రెండోసారి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బస్సు ఛార్జీలను పెంచిన తెలంగాణ ఆర్టీసీ కేవలం 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి బస్సు ఛార్జీలను పెంచేసింది.
ఎందుకంటే.. డీజిల్ సెస్ పేరిట రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతున్నట్టు వెల్లడించింది. సిటీ ఆర్డినరీ సర్వీసులతో పాటు పల్లె వెలుగు బస్సుల్లో రూ. 2 చొప్పున పెంచేసింది. అలాగే డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ. 5 చొప్పున పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. అంతేకాదు.. బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా పెంచింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు ధరలు శనివారం (ఏప్రిల్ 9) నుంచే అందుబాటులోకి రానున్నాయి.
సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10గా ఉండనుంది. చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో డీజిల్ సెస్ అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ మరోసారి ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు. ఇప్పటికే ఒకవైపు ఇంధన ధరలు పెంపుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రప్రజలకు ఆర్టీసీ ఛార్జీలు కూడా బాదడంతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..