...

Jagga Reddy : కాంగ్రెస్‌లో ముసలం..ఇతర నేతలపై జగ్గన్న ఫైర్..!

Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ కోసం నిక్కచ్చిగా పని చేసేది తానేనని, తనపైనే కోవర్టు ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ,ఇకనుంచి తన జోలికి వస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆన్ లైన్ లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ కావడంతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు.

తనపై ఒక వర్గం ఉద్దేశపూర్వకంగానే కోవర్టు అని ప్రచారం చేస్తోందన్నారు. కొన్ని నిర్ణయాలు తనను కూడా ఇబ్బంది పెట్టాయని,ఏఐసీసీ కి అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే లేఖ పంపినట్లు ఒప్పుకున్నారు. పార్టీలో ఇదే వైఖరి కొనసాగితే తాను రాజీనామా చేసేందుకు కూడా వెనకాడనని జగ్గారెడ్డి హెచ్చరించారు. అనంతరం మాజీ ఎంపీ విహెచ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందని,తనపై మంచిర్యాలలో దాడి చేసిన వారికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు.

విహెచ్ పై దాడి చేసిన ప్రేమ్ సాగర్ రావు కు నోటీసు ఇచ్చామన్నారు. జనగామ డిసిసి ప్రెసిడెంట్ రాఘవ రెడ్డికి కూడా నోటీసు ఇచ్చామని,ఇటీవల జగ్గారెడ్డి వ్యవహారంలో కూడా వివరణ అడిగామని తెలిపారు.అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ జంగ్ సైరన్ దీక్షలు, వరి దీక్షలు, వరి కల్లాల్లోకి కాంగ్రెస్ లాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టామని ఏఐసిసి పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశామని తెలిపారు.

అదేవిధంగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎవరి బాధ్యత వారే నిర్వర్తించాలని సూచించారు.ఇటీవల ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణలో కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు.ఇలాంటి పరిస్థితులు పార్టీ నేతలను సందిగ్ధంలో పడేస్తాయని, మహేశ్వర్ రెడ్డి కి పార్టీ నేతలు సహకరించాలని సూచించారు. ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా కార్యక్రమాలను ప్రకటించడం సరికాదని, కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also : Vanama Raghava : వనమాపై రామకృష్ణ సంచలన కామెంట్స్.. అసలు సూత్రధారి ఆయనేనంటూ మరో వీడియో..