...

PRC Issue : ఏపీలో ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చిన హైకోర్టు…

PRC Issue : ఏపీలో ఉద్యోగ సంఘాలకు హైకోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. చట్ట వ్యతిరేకంగా సమ్మె జరుగుతుందని ప్రభుత్వం భావిస్తే… నిషేధించే హక్కుందని వ్యాఖ్యానించింది. అలానే పీఆర్‌సీ జీవోల రద్దు కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు, సమ్మె యోచనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు లంచ్‌ మోషన్‌గా స్వీకరించి విచారించింది. జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ మన్మథరావు బెంచ్‌ పిటిషన్‌ను విచారించింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఆ స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పెన్‌ డౌన్‌ అయినా, సమ్మె అయినా అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్‌ 4 కింద నిషేధం ఉందని ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా ? అని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ సందర్భంగా పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించ లేకపోతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గురువారం విజయవాడలో జరిగిన ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏజీ తెలిపారు.

andhra-pradesh-state-high-court-shocking-judgement-about-prc-issue
andhra-pradesh-state-high-court-shocking-judgement-about-prc-issue

ఎల్లుండి నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఉద్యోగులు ఏమి చేయబోతున్నారో తెలియకుండా స్పందించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగుల వాదనలు కూడా వింటామని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 10 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read Also : Health Tips : పెరుగు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసా… ఏంటంటే ?