...

UGC Dual degress: ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు చేయొచ్చు.. హమ్మయ్య!

విద్యార్థులు ఒకే సారి రెండు డిగ్రీలను కొనసాగించడానికి యూజీసీ అనుమతి ఇచ్చింది. డిగ్రీలను ఒకే విశ్వ విద్యాలయంలో లేదా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కూడా పొంద వచ్చని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. భౌతిక తరగతులు లేదా ఆన్​లైన్​లోనూ డిగ్రీలను చదవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయనుందని తెలిపారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లలో హింసను నివారించాలని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఇద్దరు విద్యార్థుల బృందాల మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించారు. యూనివర్సిటీలోని కావేరీ హాస్టల్‌లో శ్రీ రామనవమి పర్వదినం నాడు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణలతో హింస చెలరేగింది. ఘర్షణలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రిత్వ శాఖ జేఎన్​యూను నివేదికను కోరింది. అయితే విద్యార్థులంతా బాగా చదువుకోవాలని అనవసర గొడవల్లో తల దూర్చి జీవితాలను నాశనం చేసుకోవద్దని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.