ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వరస షాకులు ఇస్తోంది. టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఇష్టా రాజ్యంగా పెంచేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ప్రయాణికులకు తరచుగా ఛార్జీల పెంపును వడ్డిస్తున్న ఆర్టీసీ.. మరో భారం వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను కూడా పెంచేసింది. గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ ధర కంటే అదనంగా 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవలే టికెట్ ఛార్జీలను పెంచిన తెలంగాణ ఆర్టీసీ… మళ్లీ ఇప్పుడు అడ్వాన్స్ టికెట్ ఛార్జీలను పెంతడంతో ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి కంగుతింటున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేకుండా తెలంగాణ ఆర్టీసీ ఇష్టా రాజ్యంగా ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా తరచూ ధరలు పెంచుకుంటూ పోతే… సామాన్య ప్రజలు బస్సులు కూడా ఎక్కలేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉండి ఆలోచించి టిక్కెట్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.