Afghanisthan : ఆఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుండి మహిళల విషయంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. తాలిబన్లకు భయపడి ఎంతోమంది మహిళలు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. ఆ దేశంలో తాలిబన్లు మహిళలకు పెట్టే ఆంక్షలు అంత కఠినంగా ఉంటాయి. ఇటీవల తాలిబన్లు మహిళల విషయంలో మరొక కఠిన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ముస్తాబై వచ్చి వార్తలు చదువుతూ ఉంటారు. కొన్ని ముస్లిం దేశాలలో మహిళలు తల కనిపించకుండా కప్పుకొని వార్తలు చదువుతారు.
కానీ ఆఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల వార్తలు చదివే మహిళ యాంకర్ ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రెజెంటర్ లు వార్తలు చదివే సమయంలో శరీరంతో పాటు ముఖం కూడా కనిపించకుండా కప్పుకొని వార్తలు చదవాలని, వార్తల కవరేజ్ కోసం వెళ్లే మహిళా రిపోర్టర్లు కూడా ముఖం కనిపించకుండా పూర్తిగా కప్పుకొని వెళ్లాలని నిబంధన పెట్టింది. ఇదివరకే మహిళలు బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు ముఖం కనిపించకుండా కప్పుకోవాలని, బట్టల దుకాణాలు పెట్టే డిస్ప్లే బొమ్మలకు కూడ తలలు ఉండకూడదు అని ఆంక్షలు పెట్టింది.
తాలిబన్ల పరిపాలనతో అక్కడి ప్రజలు చాలా విసుగు చెందారు. వారు విధించిన ఆంక్షలు అతిక్రమించితే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. ఈ విషయం గురించి తాలిబన్ల మంత్రి అఖిఫ్ మహజార్ మాట్లాడుతూ.. ఈ విషయంపై ఇదివరకే టీవీ ఛానల్స్ తో మాట్లాడామని, ఈ నెల 21 వరకు గడువు ఉందని చెప్పారు. ఈ నియమాలు అతిక్రమించితే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని ఆయన వెల్లడించారు. కరోనా సమయం నుండి మాస్కులు వేసుకోవటం అలవాటు చేసుకున్న ప్రజలు వాటిని అలాగే కొనసాగించాలని ఉచిత సలహా ఇచ్చాడు.
Read Also :Viral Video: పెళ్ళిలో మాస్ స్టెప్పులతో రచ్చ చేసిన పెళ్ళికూతురు.. వైరల్ గా మారిన వీడియో..!