Girl missing: ఆడుకుంటూ అడవిలోకి.. 36 గంటల తర్వాత అమ్మ ఒడికి!

చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం పోలీసులు గుర్తించారు. అడవిలో 36 గంటల పాటు గడిపిన ఆ పాపను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవితల కుమార్తె జోషిక. ఈ పాప వయసు కేవలం నాలుగేళ్లు. అయితే శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు ఆడుకుంటూ వెళ్లి కనిపించకుండా పోయింది. చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆధేశాలతో పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో రాత్రంతా వెతికారు. ఇంటి సమీపంలోని నాలుగు నీటి కుంటల్లో అగ్నిమాపక శాఖ ద్వారా నీరు తోడించారు. అయినా లాభం లేదు.

డాగ్ స్క్వాడ్ ద్వారా బాలిక దుస్తులు చూపించగా.. ఆ జాగిలం అటవీ ప్రాంతంలో ఉన్న పాపను గుర్తించింది. అంబాపురం అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల పాప కనిపించింది. 36 గంటల పాటు పాప ధైర్యంగా అడవిలో గడిపిందని.. ఎండ తీవ్రత కారణంగా కాస్త అలసటగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.