Extend age limit for police: యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయో పరిమితి పెంపు..!

రాష్ట్రంలో ఉన్న యూనిఫామ్ సర్వీసులు.. పోలీసు, అగ్ని మాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక దళం తదితర ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 48ను ఈరోజు విడుదల చేసింది. ప్రత్యక్ష నియామకాలకు రెండోళ్ల పాటు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించింది.

maximum age relaxation increased for the police and other uniform services

అయితే కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. ఇప్పుడు పెంచిన మూడేళ్లతో కలిపి.. ఈ పరిమితి 25 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రస్తుతం 27 సంవత్సరాలుగా ఉన్న గరిష్ఠ వయో పరిమితి 30కి చేరుతుంది. అలాగే ఎస్సై ఉద్యోగాలకు కనిష్ఠ వయసు 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లుగా ఉంది. ఇకపై ఇది 28 ఏళ్లకు చేరుతుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం 30 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉండగా.. ఇకపై 33 అవుతుంది. డీఎస్పీ పోస్టులకు కనిష్ఠ వయోపరిమితి 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 30గా ఉంది. ఇకపై అది 33 అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 35 నుంచి 38 ఏళ్లకు పెరుగుతుంది.