Coffee effect: కాఫీ, టీ పానీయాలు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నా కావు. ఈ వేడి వేడి పానీయాలు మానసిక ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తాయి. అలాగే క్యాన్సర్ వంటి రోగాలను కూడా దరిచేరనివ్వవు. టీ తర్వాత ప్రజలు ఎక్కువగా తాగే డ్రింక్స్ లో కాఫీ యే ఉంటుంది. అయితే టీలో లాగే కాఫీలో కూడా కెఫీన్ శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే విద్యార్ఖులు పరీక్షల సమయాల్లో చురుకుగా ఉండేందుకు రాత్రిళ్లు వీటిని తాగుతుంటారు. అయితే మోతాదుకు మించి తాగితే వీటి వల్ల సైడ్ ఎఫెక్స్ట్ కూడా ఉన్నాయి. తాజాగా దీని వల్ల మరో సమస్య వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే కచ్చితంగా తలనొప్పి వస్తుందని ఆ అధ్యయనం వివరిస్తోంది.
అధిక మొత్తంలో తీసుకునే కెఫీన్ తలనొప్పికి దారి తీస్తుంది. ప్రతిరోజూ 400మి.గ్రా లేదా 4 కప్పుల కాఫీ తాగడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. రెండు వారాల కంటే ఎక్కువ రోజుల పాటు రోజుకు 200 మి. గ్రా లేదా అంతకంటే ఎక్కువ కెఫీన్ తీసుకున్న వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం కూడా ఉందట. మైగ్రేన్ అంటే తలకు ఓ వైపున వచ్చే తీవ్రమైన నొప్పి. అయితే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిసి ఒక్కసారిగా మానేసినా వీటితో సమస్యే. కాబట్టి మెల్లి మెల్లిగా కాఫీ తాగటాన్ని తగ్గించండి. రోజులో ఒక్క సారి మాత్రమే కాఫీ తాగేలా చూస్కోండి.