E-scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే భయపడే పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ప్రముఖ సంస్థ అయిన ఓలా స్కూటర్లు వచ్చినప్పటి నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా కాలిపోతున్నాయి. వేరే బ్రాండ్ కు చెందిన వెహికిల్స్ కూడా పేలిపోతున్నా… ఓలా స్కూటర్లే సంఖ్యే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావడం, అమాంతం పేలిపోవడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోవడానికి కారణాలు ఏమిటో కనుక్కోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోప భూయిష్ఠంగా ఉండటమే ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమని ఫెడరల్ పరిశోధన ప్రకారం వెల్లడైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.
ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్ 2022లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఈ-స్కూటర్ తయారీ దారుగా ఉంది. ఓలా విషయంలో బ్యాటరీ సెల్ తో పాటు బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో లోపాలు కూడా కారణంగా గుర్తించినట్లు తెలుస్తోంది. తదుపరి తనిఖీలు చేయడానికి ప్రభుత్వం మూడు కంపెనీల నుండి బ్యాటరీల నమూనాలను తీసుకుంది. విచారణకు సంబంధించిన తుది నివేదిక రెండు వారాల్లో వెలువడనున్నట్లు సంబంధిత వర్గాల నుండి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది.
దేశంలో ఈ-స్కూటర్లు, ఈ-బైక్ లను 2030 నాటికి 2 శాతం నుండి 80 శాతం మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఉండాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనప్పటికీ.. భద్రతాపరమైన ఆందోళనలు వినియోగదారుల ఈవీలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. దేశంలో కర్భణ ఉద్గారాలను తగ్గించేందుకు ఈవీల వినియోగం పెంచాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.