Serial killer: ఫేమస్ అవ్వాలనే కోరికతో ఆరు రోజుల్లో నలుగురిని హతమార్చిన సీరియల్ కిల్లర్!

Serial killer: ఫేమస్ అవ్వాలనే ఆశతో ఆ 19 ఏళ్ల బాలుడు ఏం చేశాడో తెలుస్తే అందరూ షాకవ్వాల్సిందే. చాలా మంది ఫేమస్ అయ్యేందుకు వివిధ స్టైల్స్ లో వీడియోలు చేయడమో, కొత్తగా ఏమైనా కనిపెట్టడం వంటివో చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం మనుషుల ప్రాణాలను తీశాడు. అది కూడా ఫేమస్ అవ్వడానికే.

మధ్య ప్రదేశ్ కు చెందిన శివ్ గోండ్ అలియాస్ హల్కు… ముఖ్యంగా షాపింగ్ మాల్స్, భవనాల ముందు నిద్రిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని ఆరు రోజుల్లో నలుగురిని హతమార్చాడు. సాగర్ జిల్లా కైక్రా గ్రామానికి చెందిన శివ్ ది చిన్నప్పటి నుంచి నేర పూరిత స్వభావమే. గిరిజన కుటుంబానికి చెందిన శివ్ చిన్నప్పుడే ఓ కిరాణ కొట్ట యజమాని తల పగులగొట్టాడు. అయితే వరుసగా హత్యలకు పాల్పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

చివరగా శివ్ మోతీ నగర్ లోని ఓ వాచ్ మెన్ ను చంపాడు. అతడి ఫోన్ ను కూడా వెంట తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ హత్యతో పాటు మరో ముగ్గురిని కూడా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఫేమస్ అవ్వడం కోసమే ఈ హత్యలు చేసినట్లు చెప్పగా పోలీసులు షాకయ్యారు.