...

Marriage Tragedy : పెళ్లింట విషాదం.. ముహూర్తానికి ముందే పెళ్లికొడుకు స్పాట్ డెడ్, పెళ్లి దండలు చావుకు..!

Marriage Tragedy : పెళ్లింట విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి వేడుక జరగాల్సి ఉంది.. ముహూర్తానికి ముందే ప్రమాదవశాత్తూ పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లిపీటలపై వేయాల్సిన దండలను వరుడి మృతదేహాంపై వేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మహబూబ్ నగర్ 167వ నెంబర్ జాతీయరహదారిపై జరిగింది. మరో మూడు గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. మార్గం మధ్యలో కారు చెట్టును ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

జడ్చర్ల పోలీసులు కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ లో స్థానిక కాలనీలో ఉండే చైతన్య శామ్యూల్‌ (34) నారాయణ పేట జిల్లాలోని తిర్మలాపూర్‌‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. వనపర్తి పట్టణానికి చెందిన యువతితో ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మహబూబ్‌నగర్‌ వివాహ వేదికపై గురువారం ఉదయం 11.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. అదే రోజు మధ్యాహ్నం పక్కనే ఉన్న ఫంక్షన్‌ హాల్‌లో విందు అతిథుల కోసం ఘనంగా విందు భోజనాలు కూడా ఏర్పాట్లు చేశారు.

పెళ్లి దండలు, రింగు మార్చుకోవడమే తరువాయి. పెళ్లి వేదికకు దగ్గరకు కారులో పయనమైన పెళ్లికుమారుడికి రోడ్డుప్రమాదం జరిగింది. ఉదయం 8 గంటలకు వరుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుల కోసం కారులో జడ్చర్లకు వెళ్లాడు. నక్కలబండ తండా గ్రామం మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

ఆ ప్రమాదంలో వరుడి తల, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. శామ్యూల్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒకే ఒక కొడుకు కూడా చనిపోవడంతో ఆ వరుడి తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు.

అప్పటివరకూ సందడిగా ఉన్న పెళ్లి వేడుకు విషాదంతో నిండిపోయింది.పెళ్లికి వచ్చిన అతిథులు, కుటుంబ సభ్యులంతా వరుడి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లిలో వేయాల్సిన పూల దండలను వరుడి మృతదేహానికి వేయాల్సి వచ్చిందంటూ వచ్చిన బంధువులంతా ఆవేదన వ్యక్తం చేశారు. వధువరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Read Also : Hang Wall Clock : మీ ఇంట్లో గోడ గడియారం ఏ దిశగా ఉందో చెక్ చేసుకోండి..? రాంగ్ డైరెక్షన్‌లో చాలా నష్టపోతారు