Crime: సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఆ గొడవలు ప్రాణాలు సైతం తీయవచ్చు. భార్య భర్తలు గొడవ పడినప్పుడు ఆ ఆవేశంలో భార్య భర్త ప్రాణాలు తీయడం, లేకపోతే భర్త భార్య ప్రాణాలు తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్య మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోగా, చనిపోయిన భార్య చితిమంటల్లో కి దూకేసాడు ఒక భర్త. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లా జైత్ పుర్ గ్రామంలో బ్రిజేష్, ఉమ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. అయితే ఉమ కు ఆరోగ్యం బాధ లేకపోవడంతో హాస్పిటల్ కి వెళ్లడానికి తన భర్తను 500 రూపాయలు కావాలి అని అడిగింది. అప్పుడు భర్త బ్రిజేష్ ఇప్పుడు లేవు తర్వాత రోజు ఇస్తానని చెప్పగా, ఆ మాట విన్న ఉమ తీవ్ర మనస్థాపానికి గురి అయ్యింది. దీనితో అర్ధరాత్రి సమయంలో అందరూ ఇంట్లో నిద్రపోతుండగా గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఉమ ఉరివేసుకొని విగతజీవిగా కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోస్టుమార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని జైత్ పుర్ లోని స్మశాన వాటికకు తరలించారు. ఇక అప్పుడు భార్యకు అంతిమ క్రియలు నిర్వహించిన బ్రిజేష్ తన భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే రగులుతున్న తన భార్య చితిమంట లోకి దూకాడు. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు అప్రమత్తమై అతన్ని బయటకు లాగారు. తన భార్య చిన్న కారణం చేతనే అలాంటి నిర్ణయం తీసుకుందని, తన భార్య చనిపోయిన తరువాత తనకు బతకాలని లేదు అని బ్రిజేష్ తెలిపాడు. మరొకవైపు ఉమ కుటుంబ సభ్యులు మాత్రం కట్నం కోసం భర్త అత్తమామలు తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.