ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. ఎండకాలంలో కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ కరెంటు కోతలు తప్పడం లేదు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి.
ఒక వైపు వేడితో తట్టుకోలేక ఫ్యాన్ వేసుకోవాలని చూస్తే.. కరెంటు లేక చాలా ఇళ్లల్లో నరకం చూస్తున్న వైనం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు పవర్ కట్ తో అల్లాడుతున్నాయి. విశాఖ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సాయంత్రం పూట రెండు గంటలు కరెంటు తీస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే కరెంటు టారిఫ్ లు పెంచేసి విద్యుత్ వాడాలంటే వణికే పరిస్థితి తీసుకువచ్చింది.
పవర్ హాలీడేలు ప్రకటించడంపై జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సాధారణ ప్రజలతో పాటు వ్యాపార వర్గాలు ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనాన్ని పట్టి పీడిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.