September 21, 2024

T20 World Cup: భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ ఆడటానికి వెళ్లలేదనుకుంటే బెటర్

1 min read
T20 World Cup New Zealand beats India

T20 World Cup New Zealand beats India

T20 World Cup: ఇండియన్ క్రికెట్ టీమ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుని.. జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో పరువును పోగొట్టుకుంది. ఇంతకు ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత్.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే పరాభవాన్ని కంటిన్యూ చేసింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు సెమిస్ ఆశలు ఆవిరైపోయాయి. టాస్ ఓడిపోవడంతోనే ఈ మ్యాచ్ కూడా అయిపోయిందనే పరిస్థితి భారత అభిమానుల్లో నెలకొన్నప్పటికీ.. టీమ్‌లో ఉన్న ఉద్దండులపై ఎక్కడో చిన్న ఆశ పెట్టుకున్నారు.

కానీ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమై మరోసారి భారత్ జట్టు చేతులెత్తేసింది. ఈ ఓటమిని చూసిన భారత అభిమానులు సోషల్ మీడియాలో ‘దృశ్యం’ చిత్రంలో వెంకీ డైలాగ్స్‌తో మీమ్స్‌ని వదులుతున్నారు. ‘భారత్ జట్టు అసలు ఈ వరల్డ్ కప్ ఆడటానికే వెళ్లలేదు.. అంతా ఇదే అనుకోండి’ అంటూ వారు వదులుతున్న మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్కటే కాదు పలు మీమ్స్ ఇప్పుడు భారత్ జట్టుపై సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు చూసిన వారంతా.. భారత ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసి బలమైన ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఇచ్చారు. రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాండ్యా 23, కెఎల్ రాహుల్ 18, రోహిత్ 14, పంత్ 12 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బోల్ట్ 3 వికెట్లు, సోధి 2 వికెట్లు తీసుకున్నారు.

అనంతరం 111 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీమ్ బ్యాట్స్‌మెన్, భారత బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్స్ గుప్తిల్‌ (20), మిట్చెల్(49)‌లను బుమ్రా అవుట్ చేసినా.. కెప్టెన్ విలియమ్సన్, కొన్వేతో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేశారు. 14.3 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి సెమిస్ ఆశలను నిలుపుకోగా, మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిచినా.. సెమిస్ చేరే అవకాశాన్ని భారత్ దాదాపు కోల్పోయినట్లే. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లలోనైనా గెలిచి భారత్ పరువు నిలుపుకుంటుందేమో చూద్దాం.

Read Also :  
Rajamouli Movie Mahesh Babu : రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేశ్‌తోనే… అందుకోసం ఓ ప్రాజెక్టును వదులుకున్న జక్కన్న..