Snakes in Hospital: ఒక్క పామును చూస్తేనే ఆమడంతా దూరం పరుగులు పెడతాం. చాలా భయపడిపోతూ పాములు పట్టే వాళ్లకు ఫోన్ చేయడమో లేదంటే పెద్ద కర్ర తీస్కొని దాన్ని చంపడమో చేస్తుంటాం. కానీ అక్కడ ఒకే చోట వందలాది పాములు కనిపిస్తే ఏం చేస్తాం. ఏం చేస్తామా… పారిపోతాం అనుకుంటున్నారా. అయినా అన్ని పాములు ఒకేసారి ఎలా కనిపిస్తాయి అనుకుంటున్నారా… కనిపిస్తాయి.. కాదు కాదు కనిపించాయి. ఎక్కడ అడవిలో అనుకునేరు.. ఆస్పత్రిలో. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వందలాది పాములు దర్శనం ఇచ్చాయి.
అడుగు అడుగుకో పాము కనిపిస్తూ.. రోగులను, వారి బంధువులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే వరదల కారణంగా ఆ పాములన్నీ ఆసుపత్రిలోకి కొట్టుకు వచ్చాయి. ఆ బురదలోనే తిష్ట వేసిన పాములు.. ఆస్పత్రి క్లీనింగ్ సిబ్బందిని కాటు వేశాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాముల బెడద తొలిగే వరకు ఆస్పత్రికి వెళ్లే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.