తెలంగాణలో పండిన యాసంగి వడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతి గ్రామంలో బుధవారం నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు నలుగురు ఉన్నత అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని ఇందులో ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, వ్యవసాయ, సాగునీటి శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. అయితే ఈ యాసండి వడ్లు కొనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 3 నుంచి 4 వందల కోట్ల రూపాయల ఖర్చు వస్తుందని తెలిపారు. అయినప్పటికీ రైతులు చిన్నబుచ్చుకోకూడదనే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే కొంటున్నట్లు వివరించారు. అయితే ఉచిత విద్యుత్‌కు రూ.12 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు, రైతుబీమాకు రూ.1,600 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు.
దేశానికి సమగ్ర నూతన వ్యవసాయ విధానం రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల రైతులు, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ వంటి నిపుణులను పిలుస్తామన్నారు. హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించి, ముసాయిదా విధానాన్ని విడుదల చేస్తామన్నారు. దానిని కేంద్రం విధిగా అనుసరించాల్సిందేనన్నారు.